మంగపేట మండల వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ములుగు జిల్లా, మంగపేట (ఆంధ్రప్రభ): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మంగపేట మండల వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. యువజన, మహిళా, కుల సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోనూ వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం పలుచోట్ల మిఠాయిలు పంపిణీ చేశారు.
మంగపేట తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ తోట రవీందర్, పోలీస్ స్టేషన్లో ఎస్సై టీవీఆర్ సూరి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భద్రు నాయక్, మంగపేట ప్రాథమిక రైతు సేవా సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ తోట రమేష్, అటవీ శాఖ కార్యాలయంలో ఇన్చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లాయక్ హుస్సేన్ జాతీయ పతాకాలను ఎగురవేశారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు, అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఎంపెల్లి వీరాస్వామి, ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో ఎంఈఓ పొదెం మేనక, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
