డీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను అవమానించారంటూ కాంగ్రెస్ ఆందోళన

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: ఏఐసీసీ ఆదేశాల మేరకు, పీసీసీ పిలుపుతో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను అవమానించే విధంగా వ్యవహరించారంటూ ఈ నిరసన చేపట్టారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపల్ గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించి అనంతరం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. భారతదేశంలో గతంలో అంటరానితనం తీవ్రంగా ఉండేదని, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కుల వివక్షను రూపుమాపేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇలాంటి వివక్షను ప్రోత్సహించే విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

కిల్లి కృపారాణి వ్యాఖ్యలు

మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ.. జార్ఖండ్‌లోని రాంలీలా మైదానంలో మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న సభ అనంతరం కొంతమంది సభా ప్రాంగణాన్ని శుద్ధి చేశారని ఆరోపించారు. ఇది కుల వివక్ష భావాలకు, అహంకార రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన సమానత్వం, లౌకికవాదం, భావ స్వేచ్ఛ స్ఫూర్తికి విరుద్ధంగా దేశంలో పాలన సాగుతోందని ఆరోపించారు. కుల, మతాల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, కాంగ్రెస్ నాయకులు బొడ్డేపల్లి గోవింద్ గోపాల్, కేవీఎల్ఎస్ ఈశ్వరి, ఆబోతుల వెంకట నాయుడు, బొత్స వెంకటరమణ, కరిమజ్జి మల్లేశ్వరరావు, ఇజ్జురోతు రమణ, లఖినేని నారాయణరావు, బస్వా షణ్ముఖరావు, చాన్ బాషా, గొల్లపల్లి దాలయ్య, వేదాంతం తిరుమలరావు, సోడవరం చంద్రశేఖర్, చోడవరం లీలారాణి, సూర్యా బేగం తదితరులు పాల్గొన్నారు.