మాజీ మంత్రులకు అచ్చెన్నాయుడు సవాల్‌

  • ఐదేళ్లు అధికారంలో ఉండి జిల్లాకు ఏం చేశారు?
  • వంశధార, నేరడి బ్యారేజీపై గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి విషయంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో జిల్లాకు చేసిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

గార మండలం వమ్మరవల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 2019–24 మధ్య అధికారంలో ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మైక్‌ దొరికిందని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో సాగునీటి రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి ఆరోపించారు. 2014–19 మధ్య వంశధార ప్రాజెక్టు 94 శాతం పూర్తయినప్పటికీ, మిగిలిన పనుల కోసం ఐదేళ్లలో కనీసం నిధులు కేటాయించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశధార ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టిందని తెలిపారు.

గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పేరుతో చేపట్టిన పనుల వల్ల ప్రజలకు ప్రయోజనం కలగకపోగా ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా నిలిపివేసిన పనులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందన్నారు.

వంశధారకు నేరడి బ్యారేజీ కీలకం

వంశధార నది శ్రీకాకుళం జిల్లాకు వరప్రదాయిని అని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఏడాది వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్నప్పటికీ పరివాహక ప్రాంత గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదన్నారు. వంశధార నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణమే శాశ్వత పరిష్కారమని తెలిపారు.

నేరడి బ్యారేజీ కోసం దివంగత ఎర్రన్నాయుడు, అప్పయ్యదొర, కణితి విశ్వనాథం తదితరులు చేసిన ప్రయత్నాలను మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఒడిశాతో ఉన్న అంతర్రాష్ట్ర సమస్య పరిష్కారానికి సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరడి బ్యారేజీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఢిల్లీలో సమస్య పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సమస్యకు పరిష్కారం లభించిందన్నారు.

గెజిట్‌ వచ్చినంత మాత్రాన సంతృప్తి చెందకుండా బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ.641 కోట్ల నిధులు మంజూరు చేయించామని వెల్లడించారు.

రెండు నెలల్లో టెండర్లు పిలిచి, సుమారు ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. బ్యారేజీ పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.

బహిరంగ చర్చకు రావాలి

గతంలో అధికారంలో ఉన్న వారు జిల్లా అభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమయ్యారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడకుండా వాస్తవాలపై చర్చకు రావాలని కోరారు.

“2019–24 మధ్య ఐదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పండి. ధైర్యముంటే బహిరంగ చర్చకు రండి” అని మాజీ మంత్రులకు సవాల్‌ విసిరారు. శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయడం, సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.