క్రీడలతో యువతకు బంగారు భవిష్యత్తు
లింగపాలెం, ఆంధ్రప్రభ: గ్రామీణ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ అన్నారు. లింగపాలెం మండలం సుందరపేట గ్రామంలో నిర్వహించిన భారీ వాలీబాల్ టోర్నమెంట్‌ను ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్నతో కలిసి ఆయన శుక్రవ్రణ ప్రారంభించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఈ క్రీడా పోటీలను నిర్వహించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు వారిలో సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఐ క్రాంతి కుమార్, క్రీడలు యువతలో శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.టోర్నమెంట్ అనంతరం యువత కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. క్రీడల ద్వారా యువతను ఏకం చేస్తూ, వారిలో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్థులు అభినందించారు.
