12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పర్మిట్ల సమస్య పరిష్కరించాలి

రవాణా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌కు లారీ ఓనర్ల విజ్ఞప్తి

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య గత 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కౌంటర్‌ సిగ్నేచర్‌ పర్మిట్ల సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఐఏఎస్‌ను కోరారు.

శుక్రవారం సచివాలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కోన శశిధర్‌ను అసోసియేషన్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రవాణా రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా ఏపీ–తెలంగాణ మధ్య కౌంటర్‌ సిగ్నేచర్‌ పర్మిట్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటంతో లారీ యజమానులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కార్యదర్శిని విజ్ఞప్తి చేశారు.

రవాణా పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిశ్రమ పరిస్థితులు, ఇతర కీలక అంశాలపై కోన శశిధర్‌ ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ వై.వి. ఈశ్వరరావు, కృష్ణా డిస్ట్రిక్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగుమోతు రాజా, ప్రధాన కార్యదర్శి ఏ.వి.వి. సత్యనారాయణ, కార్యదర్శి రావి శరత్‌బాబు పాల్గొన్నారు.