జాతీయతకు సమగ్రతకు ప్రతీకగా స్వాతంత్ర్య వేడుకలు
స్వాతంత్ర్య దినోత్సవ ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొండా ఉమా
విజయవాడ, ఆంధ్రప్రభ: జాతీయతకు, సమగ్రతకు ప్రతీకగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిలుస్తాయని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై ప్రజల్లో దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని మరింత పెంపొందించేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రచార రథాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.
మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో శనివారం నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో ఈ ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. ప్రచార రథం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ నిర్వహించే ఈ జాతీయ పండుగలో ప్రజలు, యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి ఘంటా కృష్ణమోహన్, 64వ డివిజన్ అధ్యక్షుడు కె. రవికుమార్, దేవర సత్యనారాయణ, పైడి శ్రీను, పైడి తులసి, కంచేటి నాగరాజు, బుదాల సురేష్, మోతుకూరి ఖాసిమ్ తదితరులు పాల్గొన్నారు.
