సాగునీరు లేక రైతుల రాస్తారోకో..

కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు విడుదల చేయాలని డిమాండ్
.

ఏలూరు, ఆంధ్రప్రభ: కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం, సాగునీటి శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఏలూరులో ఆందోళనకు దిగారు. పాత బస్టాండ్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన రాస్తారోకోలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వరి నారుతో రైతులు నిరసన చేపట్టారు.

అనంతరం కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు, పెదపాడు, దెందులూరు మండలాల్లోని 58 వేల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి జలాలను అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గత 20 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.

రైతులు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అప్పులు చేసి వరి నారుమళ్లు సిద్ధం చేశారని, కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా వేశారని తెలిపారు. సాగుదారుల్లో ఎక్కువ మంది కౌలు రైతులు, చిన్న, సన్నకారు రైతులేనని పేర్కొన్నారు. ప్రస్తుతం సాగునీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.

గతంలో గోదావరి జలాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కృష్ణా డెల్టాకు అందించారని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం ఆ పరిస్థితి ఎందుకు లేదని ప్రశ్నించారు. పట్టిసీమ జలాలను కృష్ణా డెల్టాకు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కేఈ కాలువకు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు.

పోణంగి పుంత కాలువ ద్వారా ఏలూరు మండల పరిధిలోని 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని, గోదావరి కాలువపై తూర్పు లాకుల వద్ద మోటార్లు ఏర్పాటు చేసి నీటిని పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు వేసిన నారుమళ్లు, నాట్లు ఎండిపోకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

కృష్ణా డెల్టా రైతుల పోరాటానికి సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు, నగర కార్యదర్శి పి. రవికుమార్ మద్దతు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. రాస్తారోకో అనంతరం రైతులు జిల్లా కలెక్టరేట్‌లోని సాగునీటి శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయానికి వెళ్లి ఉప పర్యవేక్షక ఇంజనీర్ పి. ధనుంజయులకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా డెల్టా రైతులు వాడవల్లి రామారావు, పైడిపాటి భాస్కరరావు, తలారి జయరాజు, చిన్ని పోతురాజు, మారుమూడి సువర్ణరాజు, పుట్టి దుర్గాప్రసాద్, కొమ్మన సాంబశివరావు, కోన శ్రీనివాసరావు, బి. రాంబాబు, ఎం. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.