రాత్రికి రాత్రే రూ.లక్షల కలప మాయం?

  • బేస్ క్యాంప్‌కు కూతవేటు దూరంలో చెట్ల నరికివేత
  • యంత్రాలతో అర్ధరాత్రి టేకు చెట్లను నేలకూల్చిన స్మగ్లర్లు?
  • జియోట్యాగ్ ఫొటోలకే రాత్రి గస్తీ పరిమితమైందా?
  • స్మగ్లర్లతో సిబ్బంది కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు
  • టేకు చెట్ల నరికివేతపై పర్యావరణ ప్రేమికుల ఆందోళన
  • ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో విచారణకు డిమాండ్
  • గస్తీ సిబ్బంది పాత్రపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్న ప్రజలు


అటవీ సంపదకు రక్షణగా నిలవాల్సిన అటవీశాఖ సిబ్బంది కళ్ల ముందే విలువైన టేకు చెట్లు నేలకూలుతున్నాయన్న ఆరోపణలు గూడూరు రేంజ్‌లో కలకలం రేపుతున్నాయి. అటవీ శాఖ బేస్ క్యాంప్‌కు కూతవేటు దూరంలోనే అర్ధరాత్రి యంత్రాలతో చెట్లను నరికి, రూ.లక్షల విలువైన కలపను వాహనాల్లో తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి గస్తీ సిబ్బంది ఉన్నప్పటికీ ఈ స్థాయిలో కలప తరలిపోవడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జియోట్యాగ్ ఫొటోలు తీసి విధులు పూర్తయ్యాయని భావిస్తున్నారా? అంటూ స్థానికులు, పర్యావరణ ప్రేమికులు అధికారుల తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

గూడూరు, ఆగస్టు 13 (ఆంధ్రప్రభ): మహబూబాబాద్ జిల్లా గూడూరు రేంజ్ మచ్చర్ల-దామరవంచ బీట్ పరిధిలో బుధవారం రాత్రి లారీలు, ఇతర వాహనాలతో అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన స్మగ్లర్లు విధ్వంసం సృష్టించారు. గొడ్డళ్లు, కట్టె కోత మిషన్లు, రామ్ మిషన్లు వంటి భారీ పరికరాలను ఉపయోగించి పదుల సంఖ్యలో విలువైన టేకు చెట్లను నేలకూల్చారు. కలపను కోసి గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లోకి ఎక్కించుకుని రాత్రికి రాత్రే తరలించారు. ఉదయం చూసేసరికి అడవిలో మిగిలిన చెట్ల గుజ్జెలు, టైర్ల ఆనవాళ్లను పరిశీలిస్తే ఏ స్థాయిలో ఈ స్మగ్లింగ్ జరిగిందో అర్థమవుతోంది.

కూతవేటు దూరంలోనే.. కనబడలేదా?

ఈ దోపిడీ ఏదో మారుమూల అడవిలో జరగలేదు. గూడూరు నుంచి మహబూబాబాద్ వెళ్లే రద్దీగా ఉండే జాతీయ రహదారి పక్కనే.. అదీ అటవీ శాఖ బేస్ క్యాంప్ గుడిసెను ఆనుకుని ఉన్న ప్రాంతంలోనే కావడం గమనార్హం. అర్ధరాత్రి వేళ యంత్రాలు పెట్టి చెట్లు కోస్తుంటే వచ్చే భారీ శబ్దాలు అక్కడే ఉన్న గస్తీ సిబ్బందికి ఎందుకు వినపడలేదన్నది అతిపెద్ద ప్రశ్న. బేస్ క్యాంప్‌లో ఉంటూ సిబ్బంది ఏం చేస్తున్నారు? ప్రధాన రహదారి గుండా వాహనాల్లో కలప తరలిపోతుంటే అధికారులు నిద్రపోతున్నారా? అని స్థానికులు నిలదీస్తున్నారు.

పర్యవేక్షణ ‘లొకేషన్’ ఫొటోలకేనా..?

అటవీ శాఖలో రాత్రి గస్తీ విధానం పూర్తిగా ప్రహసనంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బంది రాత్రివేళ అడవిలోకి వెళ్లి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ (జియోట్యాగింగ్) ఆధారంగా ఫొటోలు తీసి ఉన్నతాధికారుల వాట్సాప్ గ్రూపుల్లో అప్‌లోడ్ చేయడంతోనే తమ బాధ్యత తీరిపోయినట్లు ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఫొటోలు తీసిన తర్వాత క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతోందో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సిబ్బంది నిజంగా గస్తీ తిరిగితే ఇంత భారీ ఎత్తున చెట్లు నరికివేసి తరలించడం సాధ్యమయ్యే పనేనా అని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

మామూళ్ల మత్తులో మౌనం

క్షేత్రస్థాయిలో ఉన్న కొందరు సిబ్బందికి అక్రమార్కులతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో పడి స్మగ్లర్లకు అటవీ శాఖ సిబ్బందే ముందస్తు సమాచారం ఇస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ ఎత్తున యంత్రాలతో వచ్చి కలపను తరలించడం అధికారుల అండదండలు లేకుండా సాధ్యం కాదన్నది బహిరంగ రహస్యం.

విచారణతోనే అసలు నిజాలు

టేకు చెట్టు అంటే కేవలం కలప కాదు.. అదొక జీవావరణం. ఏళ్ల తరబడి పెరిగిన వృక్షాలను ఇలా అక్రమార్కులకు వదిలేస్తే భవిష్యత్తులో అడవి అనేదే మిగలదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై జిల్లా, రాష్ట్ర స్థాయి అటవీశాఖ విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

వెంటనే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలి. నరికిన కలప ఎవరి సామిల్స్ లేదా షెడ్లకు చేరిందో నిఘా పెట్టి స్వాధీనం చేసుకోవాలి. ఆ రాత్రి విధుల్లో ఉన్న గస్తీ సిబ్బంది పాత్రపై లోతుగా విచారణ జరిపి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.