క్రమశిక్షణే ఆయుధంగా.. విష్ణుగణేష్ విజయగాథ !
దమ్మపేట-5, ఆంధ్రప్రభ : సంప్రదాయ వేద విద్య నుంచి ఆధునిక విద్య వైపు అడుగులు వేసి.. క్రీడా రంగంలో ప్రతిభ చాటి.. ప్రభుత్వ ఫిజికల్ డైరెక్టర్‌గా ఎదిగిన కోవూరు విష్ణుగణేష్ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. క్రీడాకారుడిగా మాత్రమే కాకుండా విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రస్తుతం దమ్మపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో గ్రేడ్-2 ఫిజికల్ డైరెక్టర్‌గా విష్ణుగణేష్ విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో విద్యతో పాటు క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
వేద విద్య నుంచి క్రీడా రంగం వైపు..
విష్ణుగణేష్ చిన్ననాటి నుంచే తండ్రి బాలకోటయ్య మార్గదర్శకత్వంలో దేవాలయ పూజారి సంప్రదాయంలో శిక్షణ పొందారు. వేద మంత్రాలను అభ్యసించిన అనంతరం సాధారణ విద్యను కొనసాగిస్తూ క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో విద్య, క్రీడా రంగాల్లో తనదైన గుర్తింపు సాధించారు.
ఖో-ఖోలో జాతీయ స్థాయి గుర్తింపు
క్రీడలపై ఉన్న ఆసక్తి, నిరంతర సాధనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖో-ఖో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విష్ణుగణేష్ జాతీయ స్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్ యూనివర్సిటీ), నెల్లూరు తరఫున నాలుగు సార్లు సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖో-ఖో పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు.
ఎన్‌సీసీలోనూ ప్రత్యేక గుర్తింపు
విష్ణుగణేష్ ఎన్‌సీసీలో ఏ, బీ, సీ సర్టిఫికెట్లను ఏ గ్రేడ్‌లో సాధించారు. సీనియర్ అండర్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2019 జనవరి 26న ఢిల్లీలో జరిగిన పీఎం ర్యాలీలో పాల్గొనడం ఆయన ఎన్‌సీసీ ప్రస్థానంలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. అంతేకాకుండా ఎన్‌సీసీలో కేర్‌టేకింగ్ ఆఫీసర్‌గా సేవలందించారు. ఎన్‌సీసీతో పాటు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్‌గా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములయ్యారు.
దేశ సేవ లక్ష్యంతో.. ఉద్యోగాల్లో వరుస విజయాలు
దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన విష్ణుగణేష్ 2017లో కడప ఆర్మీ ర్యాలీకి ఎంపికయ్యారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కృషి కొనసాగించారు. ఆయన పట్టుదలకు ఫలితంగా 2024లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ ద్వారా సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే తన విద్య, క్రీడా అనుభవాన్ని ఉపయోగించుకుని ఫిజికల్ డైరెక్టర్‌గా సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. 2024 తెలంగాణ ఫిజికల్ డైరెక్టర్ నియామకంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి ఫిజికల్ డైరెక్టర్‌గా ఎంపిక కావడం ఆయన ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచింది.
విద్యార్థుల విజయాల్లో కీలక పాత్ర
మహబూబాబాద్‌లో పనిచేసిన సమయంలో విష్ణుగణేష్ కేవలం క్రీడా శిక్షకుడిగా మాత్రమే కాకుండా విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారు. ఆయన శిక్షణలో 17 మంది విద్యార్థులు జాతీయ స్థాయి జట్లకు ప్రాతినిధ్యం వహించి, పతకాలు సాధించడం విశేషం.విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను గుర్తించడం, వారికి నిరంతర శిక్షణ అందించడం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, పోటీ స్ఫూర్తిని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
యువతకు ఆదర్శంగా ప్రస్థానం
వేద విద్యను అభ్యసించిన బాలుడి నుంచి జాతీయ స్థాయి ఖో-ఖో క్రీడాకారుడిగా.. ఎన్‌సీసీ ఏ గ్రేడ్ సాధకుడిగా.. సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగిగా.. చివరకు ఫిజికల్ డైరెక్టర్ నియామకంలో రాష్ట్ర ప్రథమ ర్యాంకర్‌గా ఎదిగిన విష్ణుగణేష్ ప్రయాణం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్య, క్రీడలు, క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావాలను జీవితంలో భాగంగా చేసుకున్న ఆయన.. భవిష్యత్తులో మరింత మంది యువ క్రీడాకారులను జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
