మూడు నెలలుగా మూతపడిన సహకార సంఘం పెట్రోల్ బంక్
- సేల్స్ రిజిస్టర్ నిర్వహణలో లోపం..
- వాహనదారులు,రైతులకు తీవ్ర ఇబ్బందులు..
గంపలగూడెం, ఆంధ్రప్రభ: మండలంలోని తునిపాడు గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ మూడు నెలలుగా మూతపడటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం సమీప ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో అదనపు సమయం, ఖర్చు భరించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సేల్స్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడంతో సంబంధిత సేల్స్ అధికారి పెట్రోల్ బంక్‌ను సీజ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, సమస్య పరిష్కరించి బంక్‌ను తిరిగి తెరవాల్సి ఉండగా మూడు నెలలు గడిచినా ఇప్పటికీ కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే సమయంలో రైతులకు డీజిల్ అవసరం ఎక్కువగా ఉంటుందని, బంక్ మూతపడటంతో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలకు ఇంధనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని రైతులు తెలిపారు. దీంతో వ్యవసాయ పనులపై కూడా ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి రావడం వల్ల స్థానిక వాహనదారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్థులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి పెట్రోల్ బంక్ మూసివేతకు కారణమైన సమస్యలను పరిష్కరించి, వీలైనంత త్వరగా బంక్‌ను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, రైతులు కోరుతున్నారు.
