బెదిరింపులతో డబ్బుల వసూళ్లు..
- ఆత్మహత్యకు ప్రేరేపణ కేసులో ఇద్దరి అరెస్ట్
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన చేపూరి శిరీష ఆత్మహత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని డీసీపీ మధుసూదన్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగం, జీతం, సర్వీస్‌కు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి.. ఉద్యోగం కోల్పోయేలా చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసును ఆత్మహత్యకు ప్రేరేపణ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కేసులో ఏ2 ఇందూరి సిద్దా గౌడ్, ఏ3 లాండే భాస్కర్లను గురువారం కామారెడ్డి ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరానికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరినీ కామారెడ్డి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ప్రెస్ రిపోర్టర్లమంటూ బెదిరింపులు
దర్యాప్తులో భాగంగా నిందితులు తమను ప్రెస్ రిపోర్టర్లుగా పరిచయం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైంది. వారిపై ప్రతికూల వార్తలు ప్రచురిస్తామని, అధికారులకు ఫిర్యాదులు చేస్తామని, ఉద్యోగాలు పోయేలా చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.
పలు పోలీస్స్టేషన్లలో గతంలోనూ కేసులు
ఇలాంటి బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు సంబంధించి కామారెడ్డి, యల్లారెడ్డి, దోమకొండ, గాంధారి, దేవునిపల్లి పోలీస్స్టేషన్లలో గతంలోనూ పలు కేసులు నమోదైనట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుత కేసులోనూ ఇదే తరహాలో మృతురాలిపై ఒత్తిడి, బెదిరింపులు, మానసిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.
కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
