రాష్ట్ర స్థాయి ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి విద్యార్థుల సత్తా
- బైపీసీలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు..
- విద్యార్థులను ఘనంగా సత్కరించిన సీఎం రేవంత్రెడ్డి
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కామారెడ్డి పట్టణంలోని సాందీపని కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులను గురువారం హైదరాబాద్లోని బంజారా కొమరం భీం భవన్లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.
ఇంటర్మీడియట్ బైపీసీ ప్రథమ సంవత్సరంలో సాందీపని కళాశాలకు చెందిన ఐమాన్ మసీర 440 మార్కులకు గాను 439 మార్కులు సాధించి రాష్ట్ర ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెను సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అభినందించారు.
అదేవిధంగా బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఆస్మా జబీన్ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించి ప్రతిభ చాటారు. ఇద్దరు విద్యార్థుల ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం వారిని ఘనంగా సత్కరించడంతో పాటు ప్రోత్సాహకంగా ల్యాప్టాప్లను అందజేసింది.
ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో మరింత మంది ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రేరణ లభిస్తుందని పేర్కొన్నారు.
కామారెడ్డి పట్టణానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించడంపై సాందీపని కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన ఐమాన్ మసీర, ఆస్మా జబీన్లను పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, కళాశాల యాజమాన్యం అభినందించి.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాందీపని కళాశాల కరస్పాండెంట్ బాలాజీరావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
