భోగాపురం విమానాశ్రయం అద్భుతం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది నూతన ద్వారం: డా. కామినేని శ్రీనివాస్
.
కైకలూరు టౌన్, ఆంధ్రప్రభ: బొబ్బిలి నుంచి విజయవాడకు వస్తున్న సందర్భంగా కైకలూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ డా. కామినేని శ్రీనివాస్ భోగాపురం విమానాశ్రయాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
అనంతరం డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నా భూతో నా భవిష్యతి’ అన్నట్లుగా అత్యంత సుందరంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారని ప్రశంసించారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల విమానయాన అవసరాలను తీర్చడంలో భోగాపురం విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
విశాలమైన రన్వే, అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు, పచ్చదనంతో కూడిన పరిసరాలు విమానాశ్రయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ఆయన తెలిపారు. విమానాశ్రయ నిర్మాణంలో ఆధునికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణ శైలి, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలు సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఒక మైలురాయిగా నిలుస్తుందని డా. కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు.
