ప్రైజర్ పేట వీధి మూలల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు
పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ ప్రైజర్ పేటలోని కొన్ని వీధి మూలల్లో తరచూ వ్యర్థాలు తొలగించకుండా పేరుకుపోతున్నాయి. కొండ ప్రాంతాల్లో పారిశుధ్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో పాటిబండ్ల వారి వీధి, మురికిపూడి వారి వీధి మూలల్లో ప్లాస్టిక్ సంచుల్లోని వ్యర్థాలు గురువారం సాయంత్రం వరకు అలాగే ఉన్నాయి.
ఇలా తరచూ వ్యర్థాలు తొలగించకపోవడంతో 49వ డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొన్ని కాల్వల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా పేరుకుపోతున్నాయని తెలిపారు.
49వ డివిజన్ కొంతమేర కొండ ప్రాంతం కావడంతో కొన్ని చోట్ల కాల్వలు కూడా దెబ్బతిన్నాయి. పారిశుధ్య సిబ్బంది సక్రమంగా రాకపోవడంతో వ్యర్థాలు పేరుకుపోతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. కాల్వల నిర్మాణ లోపాలను సాకుగా చూపిస్తూ సిబ్బంది కాల్వలను శుభ్రం చేయడం లేదని ఆరోపించారు.
సైడ్ కాల్వల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో నీరు సక్రమంగా ప్రవహించని పరిస్థితి ఏర్పడింది. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో కాల్వల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు స్పందించి వీధి మూలల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ సంచుల్లోని వ్యర్థాలతో పాటు సైడ్ కాల్వల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారాన్ని ప్రతిరోజూ తొలగించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
