ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం సహించం

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు: ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హెచ్చరించారు. గురువారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆసుపత్రిలో వైద్య సేవలు, మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై సుమారు రెండు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రోగులు తెలిపిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే నేరుగా వైద్యాధికారులను ప్రశ్నించారు.

ప్రభుత్వం లక్షల రూపాయల జీతాలు ఇస్తుంటే విధులకు సకాలంలో రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పేద ప్రజలు వైద్యం కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. ఇకపై నిర్లక్ష్యం కనిపిస్తే సస్పెన్షన్‌కు సిఫార్సు చేస్తానని హెచ్చరించారు.

కమిటీ సభ్యులు సూచించిన అంశాలను వైద్యాధికారులు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఆసుపత్రిలో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తామని తెలిపారు. వైద్యులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదన్నారు. ఆసుపత్రి పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరుస్తామని చెప్పారు.

గత మూడు నెలలుగా ఓపీకి వైద్యులు ఆలస్యంగా వస్తున్నారని, పేద ప్రజలు ఉదయం 9 గంటల నుంచే వరుసలో ఉంటే వైద్యాధికారులు ఉదయం 10.30 గంటలకు వస్తున్నారనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు.

ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేస్తామని, విధుల పట్టిక ప్రకారం వైద్యులు, సిబ్బంది అందరూ సమయానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని వివరించారు.

ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదోడి గుడి లాంటిదని, ఇక్కడ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే జయసూర్య స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని, అయితే ముందుగా సిబ్బంది పనితీరు మారాలని తేల్చిచెప్పారు.

ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, 24 గంటలూ అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే నెలలో మరోసారి ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని, అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తానని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, వైద్యాధికారులు జక్కి రాజశేఖర్, ప్రవీణ్ కుమార్, హెడ్ నర్స్ భువనేశ్వరి, హెచ్‌ఎం హబీబుల్లా, ల్యాబ్ టెక్నీషియన్ నవీన్ కుమార్, యాదవ్ చక్రి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.