నటి షకీలాకు సర్జరీ!

  • తన ఆరోగ్య పరిస్థతి వివరిస్తూ వీడియో
  • స్మార్ట్‌ఫోన్‌ వాడకంతో ప్రభావం ఎంత!
  • ఫోన్‌ చూస్తే నిజంగానే మెడ సమస్య వస్తుందా?

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు.. పని ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ మాత్రం పక్కా ఉండాల్సిందే.. అయితే, ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్‌ వాడటంతో ఓ నటి ఎదుర్కొన్న సమస్య ఇప్పుడు చర్చకు దారి తీసింది. స్మార్ట్‌ ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించడం.. గంటల తరబడి రీల్స్‌ చూడటం.. ఒకే పొజిషన్‌ లో ఉండటంతో చివరికి సర్జరీ చేయించునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనలా ఎక్కవగా ఫోన్‌ చూసి.. ఇలాంటి పరిస్థితికి రావద్దు అంటూ.. వీడియోను పోస్ట్‌ చేయడంతో ఇప్పుడు ఈ విషయంపై చర్చ మొదలైంది.

ఒక్కప్పుడు దక్ష్మిణాదిని కుర్రాళ్లను ఉర్రూతలు ఊగించిన నటి షకీలా.. ఈ మధ్య సామాజిక మాధ్యమంలో ఎప్పుడూ ఆక్టీవ్‌గా తన విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నారు. అయితే, తీవ్రమైన మెడ వెన్నుపూస సంబంధిత సమస్యలతో ఆమె ఇటీవల మెడకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ చికిత్సకు సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు సమాచారం. కాగా ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం ఆమె తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో ద్వారా ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స, కోలుకుంటున్న తీరు గురించి వివరించారు. ఇప్పుడు ఈ వీడియో అందరినీ ఆలోచనలో పడేసింది.

షకీలా అనుభవంతో ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్‌ చూస్తూ మెడను వంచి ఉంచే అలవాటుపై మరోసారి చర్చ మొదలైంది. అయితే కేవలం ఫోన్‌ ఎక్కువగా వాడటం వల్లే శస్త్రచికిత్స అవసరమవుతుందని చెప్పలేమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మెడ వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో.. ఎక్కువసేపు తప్పుడు భంగిమలో ఉండటం వల్ల మెడపై పదేపదే ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఫోన్‌ ఎక్కువగా వాడితే మెడపై ప్రభావం ఎలా ఉంటుంది?

స్మార్ట్‌ఫోన్‌ వినియోగంలో అసలు సమస్య దాన్ని ఉపయోగించే విధానంలోనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఫోన్‌ చూస్తున్నప్పుడు తలను ముందుకు వంచి, మెడను ఒకే స్థితిలో ఎక్కువసేపు ఉంచుతుంటారు. మరికొందరు పక్కకు తిరిగి పడుకుని గంటల తరబడి ఫోన్‌ చూస్తుంటారు. ఇలాంటి భంగిమలు మెడ వెన్నెముక, దాని చుట్టూ ఉండే కండరాలపై అదనపు ఒత్తిడిని కలిగించవచ్చుని వైద్యనిపుణులు తెలుపుతున్నారు.

తప్పుడు భంగిమే అసలు సమస్య..

ఫోన్‌ చూస్తున్నప్పుడు తలను ముందుకు వంచడం వల్ల మెడ కండరాలు తల బరువును మోయడానికి మరింతగా పనిచేయాల్సి వస్తుంది. ఈ ఒత్తిడి పదేపదే కొనసాగితే మెడ నొప్పి, బిగుతు, కండరాల అలసట వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మెడ వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అందుకే ఫోన్‌ వినియోగాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా.. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా మధ్య మధ్యలో విరామాలు తీసుకోవడం, మెడను ఎక్కువగా వంచకుండా ఫోన్‌ను సరైన ఎత్తులో ఉంచడం, పక్కకు తిరిగి పడుకుని గంటల తరబడి ఫోన్‌ చూడకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.