నిబద్ధత కలిగిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ..

  • విద్యార్థి దశలోనే రాజకీయ అరంగేట్రం..
  • ప్రజాసేవలో ఐదు దశాబ్దాల ప్రస్థానం
  • అనేక కీలక శాఖలకు మంత్రిగా సేవలు..
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థవంతమైన నాయకత్వం
  • యువ నాయకత్వాన్ని ప్రోత్సహించిన వ్యక్తిత్వం..
  • అమరావతి రాజధాని కోసం విశేష కృషి
  • కన్నా సేవలు చిరస్మరణీయం..
  • ఆయురారోగ్యాలతో మరింత ప్రజాసేవ చేయాలి
  • మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి..

భవానిపురం, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నిబద్ధత కలిగిన నాయకుడని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొనియాడారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కన్నా లక్ష్మీనారాయణ ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక బాధ్యతలు చేపట్టి ప్రజాసేవకు అంకితమయ్యారని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలతో పాటు ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని పురస్కరించుకుని గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై కన్నా లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. యువకుడిగా ఉన్న సమయంలో పోలీసు అధికారి కావాలని కన్నా లక్ష్మీనారాయణ భావించారని, అనంతరం ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో అనేక కీలక శాఖలకు మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. నాయకత్వ లక్షణాలు కలిగిన యువతను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలిచిన నాయకుడిగా కన్నా లక్ష్మీనారాయణకు ప్రత్యేక గుర్తింపు ఉందని సుజనా చౌదరి అన్నారు.

ప్రజా ప్రయోజనాల విషయంలో ఆయన ఎప్పుడూ నిబద్ధతతో పనిచేశారని పేర్కొన్నారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు విశేషంగా కృషి చేసిన నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఒకరని సుజనా చౌదరి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అంశంలో ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. కన్నా లక్ష్మీనారాయణకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరింత కాలం ప్రజాసేవ చేసే శక్తిని అందించాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణను సభలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.