పెండింగ్ సమస్యల పరిష్కారానికై దశలవారీగా పోరాటం
- స్టీరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు జాడి రాజన్న..
జన్నారం, ఆంధ్రప్రభ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాడాలని యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు జాడి రాజన్న అన్నారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు మండల స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటంలో భాగంగా గురువారం మధ్యాహ్నం స్థానిక తహసిల్దార్ బక్కయ్యకు నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ,ఉపాధ్యాయ, సమస్యలపై సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన జీతభత్యాలు, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, ఇతర అన్ని రకాల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే మంజూరు చేయాలని ఆయన చెప్పారు. ఫిట్‌మెంట్‌తో కూడిన నూతన పీఆర్సీని వెంటనే ప్రకటించి, అమలు చేయాలని ఆయన తెలిపారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు, మౌలిక వసతుల కల్పనకు తగిన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల భారాన్ని పూర్తిగా తగ్గించి, కేవలం బోధనపై మాత్రమే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు.
పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు,హెచ్‌ఎం, అసిస్టెంట్ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని, పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల, విద్యారంగానికి చెందినపై సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని, లేనియెడల రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఆగస్టు 29న మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్, యూటీఎఫ్ మండలాధ్యక్షుడు నర్సయ్య, తుంగూరి గోపాల్, రాథోడ్ సురేష్ పాల్గొన్నారు.
