అపోహలు వీడండి… అవయవదానం చేయండి…

అవయవదానంపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌


( విజయవాడ, ఆంధ్రప్రభ) : అవయవదానంపై ఉన్న అపోహలు, మూఢ నమ్మకాలను వీడి అవకాశమున్నవారు అవయవదానం చేయాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ సూచించారు. గురువారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్‌లోని ఆయుష్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ సందర్భంగా ‘వాక్‌థాన్‌’ జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు.

శరీరంలోని అవయవాలను దానం చేయాలనే ఆలోచన ప్రజలలో కలిగించేందుకు ఈ వాక్‌ధాన్‌ నిర్వహిస్తున్నారన్నారు. అవయవ దానం చేయడం వల్ల కొంత మందికి జీవనాన్ని పొడిగించవచ్చని వివరించారు. అవయవ దానంపై ఉన్న అపోహాలను తొలగించడానికి ఆయుష్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. అవయవదానం చేయడం మన ధర్మమని చెప్పారు. బ్రైయిన్‌ డెడ్‌ అయి మరణించిన వారి శరీరంలోని అన్ని అవయవాలను అమర్చడం ద్వారా మరి కొంతమందికి పునర్‌జన్మను అందివచ్చునని చెప్పారు.

ఆయుష్ లోని డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ అవయవదానం చేయాలని చెప్పడమే కాకుండా అవయవాలు పాడైన వ్యక్తులకు ధైర్యం చెప్పడానికి కూడా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పారు. బందువులు, స్నేహితుల్లో ఎవరైనా చనిపోతే అవయవదానం చేసే విధంగా వారిని ప్రోత్సహించాలన్నారు.

గద్దె క్రాంతికుమార్‌ మాట్లాడుతూ అభివృద్థి చెందిన దేశాల్లో 50 శాతం మంది రిజిస్టర్డ్ ఆర్గాన్‌ డోనర్స్‌ ఉంటారని చెప్పారు. కాని మన దేశంలో రిజిస్టర్డ్ ఆర్గాన్‌ డోనర్స్‌ చాలా తక్కువ మంది ఉన్నారన్నారు. మన దేశంలో అపోహలు, మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉంటాయని, అవయవదానంపై ఉన్న మూడ నమ్మకాలను తొలగించుకుని అవయవాలను దానం చేయాలని సూచించారు. మరణించిన ఒక వ్యక్తి శరీరంలోని అవయవాలను 9 మందికి అమర్చవచ్చునని తెలిపారు. మన దేశంలో వేలాది మంది అవయవ దానం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమములో గద్దె రమేష్, డాక్టర్ యార్లగడ్డ రమేష్ బాబు, డాక్టర్ పి.శ్రీమన్నారాయణ, డాక్టర్ చక్రపాణి, డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, జయలక్ష్మి, పార్టీ కార్యకర్తులు, స్థానికులు పాల్గొన్నారు.