ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి..

  • 18–20 ఏళ్ల యువత నమోదుకు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు
  • ఫారం–6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేదు
  • 48 గంటలు దాటిన పెండింగ్‌ కేసులను వెంటనే పరిష్కరించాలి
  • మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు స్థానికంగానే సేవలు అందించాలి
  • ఓటరు అవగాహనకు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ : అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికీ తావివ్వరాదని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయం ఐదో బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పోలింగ్‌ కేంద్రాలు, ఓటరు నమోదు, ఫారం–6, 7, 8 దరఖాస్తులపై సమీక్షించారు. విజయవాడ జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

యువత నమోదుపై ప్రత్యేక దృష్టి..

18–20 ఏళ్ల మధ్య వయసున్న యువత ఓటర్లుగా నమోదు చేసుకునేలా కళాశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టి అర్హులైన యువత ఫారం–6 సమర్పించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. మహిళలు, వయోవృద్ధులు, దివ్యాంగులు, కొండ ప్రాంతాల ప్రజలు చిన్నచిన్న లోపాల పరిష్కారం కోసం దూరప్రాంత కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇఆర్వో, ఎఇఆర్వో స్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లలో అక్షర దోషాల సవరణకు ఎన్నికల సంఘం నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించాలని స్పష్టం చేశారు. 48 గంటలకు పైబడి పెండింగ్‌లో ఉన్న బీఎల్‌ఓ కాల్స్‌, స్పందన లేని కేసులు, ఎన్‌జీపీఎస్‌ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నెట్‌ వినియోగదారు పేరు, సంకేతపదం, ఓటీపీల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

15 వేల దరఖాస్తులపై వేగం..

జిల్లాలో డ్రాఫ్ట్‌ రోల్స్‌ ప్రచురణకు సంబంధించిన హ్యాండోవర్‌ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. బీఎల్‌ఓ, బీఎల్‌ఎస్‌ సమావేశాల మినిట్స్‌ అప్‌లోడ్‌ చేసి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. నోటీసుల పంపిణీ 57 శాతం పూర్తయిందన్నారు. నిర్దేశిత గడువు దాటి పెండింగ్‌లో ఉన్న సుమారు 9 వేల ఫారం–6, 6 వేల ఫారం–8 దరఖాస్తులను వేగంగా పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఓటరు నమోదు అవగాహన కోసం ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

48 గంటలకు పైబడి పెండింగ్‌లో ఉన్న 29 కేసుల్లో కొన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు, ఎన్‌జీపీఎస్‌ కింద రూ.3 వేలకుపైబడిన మొత్తాలకు సంబంధించిన నాలుగు ప్రతిపాదనలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. ఇఆర్వో లాగిన్‌లో ఆధార్‌ అనుసంధాన అభ్యర్థనలు పెద్ద సంఖ్యలో ఒకే చోట చేరడంతో పనుల వేగం తగ్గుతోందని, దీనికి సాంకేతిక పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలెక్టర్‌ కోరారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు అందేలా, ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.