డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఇద్దరికి జైలు శిక్ష..
- కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర. సతీష్
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో ఇద్దరికీ 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర. సతీష్ గురువారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరి పై కేసులు నమోదు చేసి, ఆర్మూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు.
నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్‌ఐ సతీష్ వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సతీష్ స్పష్టం చేశారు.
