ఇంద్రకీలాద్రిపై మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ..
- భద్రతా తనిఖీలకు కొత్త స్కానింగ్ గేట్..
- ఫోన్ల డిపాజిట్ తప్పనిసరి
- క్యూ లైన్ల క్రమబద్ధీకరణకు సేవా కౌంటర్ల మార్పు
- భక్తుల సౌకర్యం, భద్రతే లక్ష్యమంటున్న దేవస్థానం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలపై దేవస్థానం యంత్రాంగం మరింత దృష్టి సారించింది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంతోపాటు సులభతర దర్శనం కల్పించేలా పలు కీలక భద్రతా, పరిపాలనా సంస్కరణలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధిస్తూ కఠిన నిబంధనలు అమలు చేయాలని దేవస్థానం ఈవో సీనా నాయక్ ఆదేశించారు.
ప్రధాన స్కానింగ్ పాయింట్ వద్ద కొత్త భద్రతా గేటును ఏర్పాటు చేశారు. ఈ గేటు వద్ద భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. హోంగార్డులు, భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ మొబైల్ ఫోన్లు ఆలయ ప్రాంగణంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నారు. క్యూ లైన్లలోకి ప్రవేశించే ముందే భక్తులు తమ మొబైల్ ఫోన్లను దేవస్థానం ఏర్పాటు చేసిన కౌంటర్లలో తప్పనిసరిగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
క్యూలైన్లలో మార్పులు..

భక్తుల రద్దీని నియంత్రించి దర్శన మార్గాలను మరింత సులభతరం చేసేందుకు పలు సేవా కౌంటర్లను కూడా మారుస్తున్నారు. దర్శన టికెట్ల జారీ కౌంటర్లు, ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్లను క్యూలైన్లకు ఆటంకం కలగకుండా ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో ప్రవేశ ద్వారం నుంచి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా దర్శనానికి వెళ్లేలా మార్గాలను క్రమబద్ధీకరించారు.
సహకరించాలి..
దేవస్థానం అమలు చేస్తున్న నూతన భద్రతా నిబంధనలకు భక్తులు సహకరించాలని అధికారులు కోరారు. మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసే ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున భక్తులు ముందుగానే చేరుకుని సహకరించాలని సూచించారు. భద్రతా సిబ్బంది, ఆలయ సిబ్బందికి సహకరిస్తూ ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
