8-Members-Ap-Shg : మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ Andhra Prabha Top News

8-Members-Ap-Shg : మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ Andhra Prabha Top News

  • పొదుపు సంఘాల‌కు బిగ్ గిప్ట్
  • 10 మంది నిబంధ‌న స‌డ‌లింపు
  • 8 మంది సభ్యులున్నా రిపీట్ డోస్ లబ్ధి
  • సులభంగా బ్యాంక్ రుణాలు
  • ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు మంత్రి కొండపల్లి అభినందనలు
  • ఇతర బ్యాంకులూ అనుసరించాలని మంత్రి పిలుపు

( ఆంధ్ర‌ప్ర‌భ‌, అమ‌రావ‌తి)

8-Members-Ap-Shg : స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌శంసించారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సభ్యుల మరణం లేదా వలసల వ‌ల్ల ఒక సంఘంలో సభ్యుల సంఖ్య 10 కంటే తగ్గితే, ఆ సంఘాలు ఎంత బాగా పనిచేసినా తదుపరి రుణ సదుపాయం (రిపీట్ డోస్) పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చేద‌ని… ఈ క్ర‌మంలోనే ఏపీ గ్రామీణ బ్యాంక్ త‌మ అంత‌ర్గ‌త ఉత్త‌ర్వులు నెంబ‌ర్ 152 ద్వారా ప్ర‌త్యేక స‌డ‌లింపులు ప్ర‌క‌టించ‌డం అభినంద‌నీయ‌మ‌ని మంత్రి కొనియాడారు. అలాగే కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం క‌నీసం 8 మంది యాక్టివ్ స‌భ్యులు ఉన్న సంఘాల‌కు రిపీట్ డోస్ రుణం మంజూరు చేస్తార‌ని… అయితే స‌భ్యుల సంఖ్య త‌గ్గ‌డానికి వ‌ల‌స‌లు లేదా మ‌ర‌ణం మాత్ర‌మే కార‌ణ‌మై ఉండ‌డంతో పాటు… అక్ర‌మాలు లేకుండా.. పాత బ‌కాయ‌లు లేకుండా స‌క్ర‌మమైన చెల్లింపులు ఉండాల‌ని కూడా మంత్రి సూచించారు. అర్హత గల సంఘాలు ప్రత్యేక తీర్మానం మరియు బాధ్యతా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంద‌న్నారు. రుణ సడలింపు పొందిన సంఘాలు 6 నెలల వ్యవధిలో తమ సభ్యుల సంఖ్యను మరల కనీసం 10 మందికి పెంచుకోవాల‌ని కూడా మంత్రి తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఇచ్చే రుణం ఒక ఆర్థిక‌సాయం మాత్ర‌మే కాద‌ని.. వారి జీవ‌నోపాధి, స్వ‌యం ఉపాధికి, మహిళల ఆర్థిక సాధికారతకు నిద‌ర్శ‌నం అన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి, ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని మంత్రి ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఇదే రీతిలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (SLBC) మరియు రాష్ట్రంలో ఉన్న ఇతర బ్యాంకులు కూడా ముందుకు వచ్చి, మంచి రికార్డు ఉన్న స్వయం సహాయక సంఘాలకు 10 మంది నిబంధనను సడలించి, సులభంగా రుణ పునరుద్ధరణ సహాయం అందించాలని మంత్రి కొండపల్లి పిలుపునిచ్చారు.