జగిత్యాలలో ఘనంగా తిరంగా ర్యాలీ..

జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాలలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో గురువారం టౌన్‌హాల్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై నినాదాలతో పట్టణంలోని పురవీధులు మార్మోగాయి. దేశభక్తి గీతాల నడుమ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ… ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని, ఇదే ప్రధాని మోదీ ఆకాంక్ష అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను యువత స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశభక్తిని భావితరాలకు అందించడమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమని తెలిపారు. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి డా.భోగ శ్రావణి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.