అమ్మానాన్న లేకున్నా.. తోబుట్టువులకు నేనున్నా

తల్లిదండ్రులను కోల్పోయిన అన్నాచెల్లెళ్లకు కొన్నేళ్లుగా అండగా నిలుస్తున్న దంపతులు

బాలానగర్, ఆంధ్రప్రభ : కాలం కలిసి రాక, విధి వెక్కిరించడంతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిట్టల జ్యోతి, పిట్టల కుమార్‌కు టీ.పీసీసీ సమన్వయకర్త నందమోని దత్తాత్రేయ, ఉప సర్పంచ్ రాజేశ్వరి దంపతులు కొన్నేళ్లుగా అండగా నిలుస్తున్నారు.

వారి జీవనానికి, సొంత ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తూ ధైర్యాన్ని కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు లేని కుటుంబానికి పెద్దన్నలా అండగా ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తున్నారు.

పిట్టల జ్యోతికి ఇటీవల వివాహం నిశ్చయమై, నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెల 16న బాలానగర్ మండల కేంద్రం సమీపంలోని అయ్యప్ప దేవాలయంలో వివాహం జరగనుంది.

ఈ నేపథ్యంలో గురువారం రాజేశ్వరి, దత్తాత్రేయ దంపతులు జ్యోతికి చీరసారెను సమర్పించారు. వివాహ వేడుకకు హాజరయ్యే అతిథులకు భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.

తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబానికి కొన్నేళ్లుగా పెద్దన్నలా అండగా నిలుస్తూ, వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటున్న దత్తాత్రేయ దంపతులను మండల కేంద్రం వాసులు అభినందించారు.