నకిలీ ఏసీబీ టోకరా…

రూ.లక్షకు ఎసరు… ఏలూరు ఈఈ లబోదిబో..


ఏలూరు కార్పొరేషన్, ఆగస్టు 13 (ఆంధ్రప్రభ) : అవినీతి నిరోధక శాఖ అధికారిని అని చెప్పి నగరపాలక సంస్థ ఈఈని మోసం చేసిన సంఘటన ఏలూరు వన్ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేంద్రబాబుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. “మీపై కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. ACB విచారణకు సిద్ధంగా ఉండండి. కేసు తప్పించుకోవాలంటే 5 లక్షలు ఇవ్వాలి. ముందుగా 1 లక్ష పంపండి” అని బెదిరింపులకు దిగాడు. భయపడిన సురేంద్రబాబు, ఆ వ్యక్తి చెప్పిన రెండు ఫోన్ నంబర్లకు వెంటనే డబ్బులు బదిలీ చేశారు. మొదటి నంబర్‌కు 70 వేలు, రెండో నంబర్‌కు 30 వేలు UPI ద్వారా పంపారు.

డబ్బు పంపిన కొద్దిసేపటికే ఆ నంబర్లు స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చింది. తాను మోసపోయానని తెలుసుకున్న సురేంద్రబాబు వెంటనే ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. ACB, పోలీస్, ఇతర ప్రభుత్వ అధికారుల పేరుతో ఎవరైనా డబ్బు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఎలాంటి లావాదేవీలు చేయొద్దని అధికారులు తెలిపారు.