సమస్యల పరిష్కారమే లక్ష్యం
- కనుమూరులో సమస్యలపై ఎమ్మెల్యే కొలకపూడి ఆరా
- పొలాల రహదారి పరిశీలన
- కూలిన సప్టా స్థానంలో కొత్తది నిర్మించాలని రైతుల వినతి
- సప్టా లేక 60–70 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన
- మంచినీటి మోటార్ల సమస్యపైనా గ్రామస్తుల ఫిర్యాదు
- అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఎమ్మెల్యే ఆదేశాలు
- ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న కొలికపూడి
- కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే
గంపలగూడెం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణమే స్పందించడమే లక్ష్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కనుమూరు గ్రామంలో పర్యటించారు. బుధవారం నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు రైతులు, గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా వివరించగా.. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలోని కట్టలేరు నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర పొలాల మీదుగా వెళ్లే రహదారిని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు.
అనంతరం బాడమడుగు వద్ద కూలిపోయిన సప్టాను పరిశీలించారు. సప్టా దెబ్బతినడంతో వర్షాలు కురిసినప్పుడు, నీటి ప్రవాహం పెరిగిన సందర్భాల్లో సుమారు 60 నుంచి 70 ఎకరాల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు వివరించారు. పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు పొలాలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కూలిపోయిన సప్టా స్థానంలో నూతన సప్టా నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ను కోరారు.
రైతుల సమస్యలను సానుకూలంగా విన్న కొలికపూడి శ్రీనివాసరావు.. సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
నీటి మోటార్లపై ఫిర్యాదులు..
గ్రామంలోని మంచినీటి వాటర్ ట్యాంకులకు నీరు సరఫరా చేసే మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని మోటార్లను 24 గంటల పాటు నిరంతరం నడపడం వల్ల ఇతర ట్యాంకులకు నీరు చేరడం లేదని తెలిపారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. గ్రామంలో మంచినీటి సమస్యతో పాటు రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు.
ఇంటింటికీ వెళ్లి సమస్యలపై ఆరా..
అనంతరం కనుమూరులో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గ్రామంలోని ఇళ్లకు వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ‘సూపర్ సిక్స్’ హామీల అమలు తీరును ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబాన్ని పలకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన వినతులు, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. సమస్యలు చెప్పిన వెంటనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు ఆదేశించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు
కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు
