హర్‌ ఘర్‌ తిరంగా.. జాతీయ ఐక్యతకు ప్రతీక

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి: లక్కిరెడ్డి తిరుమలరెడ్డి

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం కేవలం ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం మాత్రమే కాదని, దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటే కార్యక్రమమని బీజేపీ ఎల్కతుర్తి మండల ప్రభారీ లక్కిరెడ్డి తిరుమలరెడ్డి అన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మన్విత్‌ హోటల్‌లో మండల బీజేపీ అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమ నిర్వహణపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్కిరెడ్డి తిరుమలరెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి భారతీయుడిలో దేశభక్తి, జాతీయ ఐక్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పట్ల గౌరవాన్ని మరింత బలపరిచే కార్యక్రమమే హర్‌ ఘర్‌ తిరంగా అని అన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేసి దేశం పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు.

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి ఇంటిలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజలను చైతన్యపరచాలని, ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం చేరేలా కృషి చేయాలని అన్నారు.

మండలంలోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శులు అల్లి కుమార్‌, చిదిరాల వెంకటేష్‌, ఉపాధ్యక్షుడు కడారి ప్రసాద్‌, కిసాన్‌ మోర్చా సిద్దిపేట జిల్లా కార్యదర్శి సామల సురేష్‌రెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల సీనియర్‌ నాయకులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు, బూత్‌ అధ్యక్షులు, కార్యకర్తలు, సామాజిక మాధ్యమాల కన్వీనర్‌ పోలు శివ తదితరులు పాల్గొన్నారు.