ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా విధులు
రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు సక్రమంగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా విధులు నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు సిబ్బందికి సూచించారు. రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు సక్రమంగా ఉండాలని, గస్తీ నిర్వహిస్తూ నేరాలను నియంత్రించడంతో పాటు పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేయాలని ఆదేశించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఉట్నూర్ పోలీస్స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, సీఐ మడావి ప్రసాద్, ఎస్సై జి. విజయ్ పూల మొక్క అందజేసి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు సిబ్బంది ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు.
పోలీస్స్టేషన్ ఆవరణను పరిశీలించిన ఎస్పీ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందితో ప్రత్యేకంగా కసరత్తు నిర్వహించాలని, ప్రతి శనివారం పరేడ్ చేపట్టాలని సూచించారు. శారీరక దృఢత్వం, వ్యాయామం ఆరోగ్యానికి కీలకమని తెలిపారు.
పోలీస్స్టేషన్ సిబ్బంది కిట్ సామగ్రి, వారికి కేటాయించిన వస్తువుల నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. దీర్ఘకాలంగా స్టేషన్లో ఉన్న వాహనాల పరిస్థితి, వాటికి సంబంధించిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్క నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.
ప్రతి సిబ్బందికి జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని, విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ పాటిస్తూ జిల్లా పోలీసుల కీర్తి ప్రతిష్ఠలను పెంచేలా పనిచేయాలని ఎస్పీ అన్నారు. పెండింగ్ లేకుండా రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.
రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ బాధితుల ఫిర్యాదులపై దర్యాప్తు పూర్తి చేసి సకాలంలో న్యాయం అందించాలని తెలిపారు. గ్రామ పోలీసు అధికారి విధానాన్ని సమర్థంగా అమలు చేస్తూ సమాచార వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు చేరేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.
కేసుల దర్యాప్తు, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు, సమన్లు, వారెంట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేయాలని తెలిపారు.
పోలీస్స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసి ఆర్థిక నేరాలను అరికట్టాలని ఆదేశించారు. రాత్రి తనిఖీల్లో వేలిముద్రల పరికరాలను వినియోగిస్తూ అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను సేకరించాలని సూచించారు. ఆర్థిక నేరాల కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితులను పట్టుకోవడంతో పాటు పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు.
గంజాయి, గుడుంబా, జూదం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సూచించారు. మండల పరిధిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించి ప్రజల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
అనంతరం ఉట్నూర్ సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, సర్కిల్ పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తును పూర్తి చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, సీఐ మడావి ప్రసాద్, ఎస్సై జి. విజయ్, ఇంద్రవెల్లి ఎస్సై ఈ. సాయన్న, ఎస్సై చిన్న గంగారం, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
