ఆలోచిద్దాం.. ఆచరిద్దాం.. వికసిత్ భారత్‌ను నిర్మిద్దాం
- కలెక్టర్ కృతిక శుక్లా పిలుపు
- దేశ నిర్మాణంలో భాగస్వాములు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం
నరసరావుపేట, ఆంధ్రప్రభ: దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “దేశ నిర్మాణంలో భాగస్వాములు” (పార్టనర్స్ ఇన్ బిల్డింగ్), “అనే నేను” ప్రచార కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పిలుపునిచ్చారు. ఆగస్టు 10 నుంచి 15 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని, యువత, విద్యార్థులు, ప్రజలు బాధ్యతతో ముందుకు వచ్చి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పాఠశాలల్లో “అనే నేను” కార్యక్రమాలు..
ఆగస్టు 10 నుంచి 15 వరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు నిర్మాణంలో తాము చేయగలిగే అంశాలపై అవగాహన పెంచుకునేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు “దేశ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను” అంటూ ప్రతిజ్ఞలు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని ప్రతి ఇల్లు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై మూడు రోజుల పాటు జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని దేశభక్తి స్ఫూర్తిని చాటాలని సూచించారు.
ఒకే రోజు మెగా మొక్కల నాటకం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆగస్టు 14న అటవీ, ఉద్యానవన శాఖల సహకారంతో జిల్లావ్యాప్తంగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో, ముఖ్యమైన ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటుతూ జాతీయ జెండాను చేతబూని దేశ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
జాతీయ రంగుల్లో ప్రభుత్వ భవనాల అలంకరణ
ఆగస్టు 14, 15 తేదీల్లో జిల్లాలోని ప్రభుత్వ భవనాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన కూడళ్లను జాతీయ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులకు సూచించారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.
తిరంగా ర్యాలీల నిర్వహణ
ఆగస్టు 12 నుంచి 14 వరకు జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండలంలో ప్రజల భాగస్వామ్యంతో తిరంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటాలని కోరారు.
సోషల్ మీడియాలో “అనే నేను” ప్రచారం
జిల్లాలోని యువత, విద్యార్థులు, ప్రముఖులు, క్రీడాకారులు, పౌరులు అందరూ సోషల్ మీడియా ప్రచారంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని 30 నుంచి 60 సెకన్ల సెల్ఫీ వీడియో రూపొందించి, “అనే నేను… దేశ అభివృద్ధి కోసం నా వంతుగా…” అంటూ తమ సందేశాన్ని తెలియజేయాలని సూచించారు. ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి @APOfficialNews పేజీని ట్యాగ్ చేయాలని తెలిపారు. #PartnersInNationBuilding, #MyIndiaMyVision, #IndependenceDay2026 హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు.
“ఆలోచిద్దాం.. ఆచరిద్దాం.. వికసిత్ భారత్‌ను నిర్మిద్దాం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కృతిక శుక్లా పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి అద్దెయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ, డ్వామా పీడీ శిద్ద లింగమూర్తి, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
