సంయమనంతోనే ‘మత్తు’ నుంచి రక్షణ

కృష్ణా ఎస్పీ విద్యా సాగర్

మచిలీపట్నం,ఆంధ్రప్రభ : సమాజం అంగీకరించని అలవాట్ల వైపు మళ్లే ముందు సంయమనంతో ఒకటికి రెండు సార్లు తమను తాము ప్రశ్నించుకోవాలని కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వి.విద్యా సాగర్ నాయుడు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ లో జరిగిన ‘నషా ముక్త్ భారత్ యువ’ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, కొత్తదనాన్ని అనుభవించాలన్న సహచరుల వత్తిడితో విద్యార్థులు చెడు వ్యసనాల వలలో చిక్కుకుంటారని చెప్పారు. చెడు అలవాట్లను ప్రోత్సహించే స్నేహానికి దూరంగా ఉంటే, విద్యార్థులు ఆరోగ్యాన్ని, కుటుంబ గౌరవాన్ని కాపాడుకోగలరని విద్యా సాగర్ హితవు పలికారు.

మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల వినియోగమే కాకుండా, వాటిని దగ్గర వుంచుకున్నా, రవాణాలో సహకరించినా కూడా చట్టం వారిని నేరస్థులుగానే పరిగణించి, కఠినమైన శిక్షలు విధిస్తుందని హెచ్చరించారు. సమాజంలో చెడుకు మంచికి మధ్య అడ్డుగోడలా నిలవాలని నషాముక్త్ భారత్ ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఎన్సీసీ కేడెట్లకు శ్రీ విద్యా సాగర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో, ఉన్నత ఆశయాలతో సమాజంలో ఆదర్శంగా నిలిచి సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి అందుబాటులో వున్న అవకాశాలను ఒడిసి పట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్సీసీ 16వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రూపేష్ అవస్థి మాట్లాడుతూ.. తమ కేడెట్లు క్రమశిక్షణతో జాతీయ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. హర్ ఘర్ తిరంగా, నషా ముక్త్ భారత్, టీబీ ముక్త్ భారత్, ఏక్ పేడ్ మా కే నామ్ వంటి కార్యక్రమాలతో జిల్లాలో ఎన్సీసీ కేడెట్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారని చెప్పారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ, వికసిత్ భారత్ నిర్మాణానికి క్రియాశీల, ఆరోగ్యకర యువత ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ఎన్సీసీ, ఎన్ ఎస్ ఎస్ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించడమే కాక క్రమశిక్షణను కూడా నేర్పిస్తాయని రమేష్ చంద్ర అన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శ్రీమతి లలిత, ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ కరస్పాండెంట్ శ్రీ పి కుటుంబ రావు, కృష్ణా జిల్లా ఈగల్ విభాగం అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఈగల్ విభాగం కార్యకలాపాలను, హెల్ప్ లైన్ వినియోగం పట్ల ఇన్స్పెక్టర్ శ్రీ పి రాంబాబు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో, విద్యార్థులు మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

అంతకు ముందు మచిలీపట్నం నగర వీధులలో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీలో విద్యార్థులు మత్తు పదార్ధాల వ్యసనాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు, నినాదాలతో అవగాహన కల్పించారు. ర్యాలీలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ఈగల్ విభాగ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.