కొండగడపలో కోతుల దాడి..
ఐదేళ్ల విద్యార్థికి తీవ్రగాయాలు
మోత్కూర్, ఆంధ్రప్రభ మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో కోతుల దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం యూపీఎస్ ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్ల విద్యార్థి తొంట యశ్వంత్‌పై కోతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
పాఠశాల పరిసరాల్లో ఉన్న సమయంలో కోతులు విద్యార్థిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో యశ్వంత్ ఎడమ మోకాలి వెనుక భాగంలో తీవ్రంగా కరిచాయి. గాయపడిన విద్యార్థిని వెంటనే మోత్కూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదే గ్రామంలో రెండు రోజుల క్రితం తాటిపాముల మానస అనే మహిళపై కూడా కోతులు దాడి చేశాయి. ఈ విషయంపై స్థానికులు మున్సిపల్ కమిషనర్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు.
కొండగడపలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, పాఠశాల పరిసరాల్లోనూ అవి సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై గతంలోనే సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. చిన్నారుల భద్రతకు ముప్పు పొంచి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
కోతుల బెడదను తక్షణమే నివారించి, పాఠశాల పరిసరాల్లో చిన్నారులకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.
