నిర్వాసిత శివగిరి అటవీ ప్రాంతంలో అధికారుల గాలింపు
పోలవరం, ఆంధ్రప్రభ: పోలవరం మండలంలోని ఖాళీ చేసిన నిర్వాసిత గ్రామాల పరిధిలోని శివగిరి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. అటవీ ప్రాంతంలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో పులి కదలికలను గుర్తించినట్లు పోలవరం అటవీక్షేత్ర అధికారి ఎస్.కె. వల్లి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత కొన్ని రోజులుగా బుట్టాయిగూడెం, కన్నాపురం అటవీ ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి మంగళవారం శివగిరి అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి పులి వెళ్లిన మార్గాన్ని ట్రాకర్ ద్వారా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
పులి కదలికలను పరిశీలించేందుకు డీఆర్వో సూరిబాబు, ఎఫ్ఎస్ఓలు మధుకర్, బాబురావు, ఇతర సిబ్బందితో కలిసి రాత్రంతా శివగిరి అటవీ ప్రాంతంలో ఉండి పర్యవేక్షించినట్లు అటవీక్షేత్ర అధికారి ఎస్.కె. వల్లి తెలిపారు.
గోదావరి నది పరివాహక ప్రాంతంలోని అటవీ ప్రాంతం గుండా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. పులి సంచారం పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పోలీసుల సూచనలు..
పోలవరం పోలీసులు కూడా పులి సంచారంపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎవరూ ఒంటరిగా పొలాలు, అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల వైపు వెళ్లవద్దని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులను రాత్రివేళల్లో బయట కట్టకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని కోరారు. పెద్దపులి కనిపించిన సమయంలో దాని దగ్గరకు వెళ్లడం, ఫొటోలు, వీడియోలు తీయడం, వెంబడించడం, రాళ్లు వేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
పులి కనిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకుని పోలీసులకు లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ లేని వార్తలు, వదంతులను నమ్మవద్దని, అధికారులు ఇచ్చే సూచనలు మాత్రమే పాటించాలని పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసు, అటవీశాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.

