సైబర్ మోసాల వలలో చిక్కుతున్న బాధితులు
పాయకాపురం, ఆంధ్రప్రభ: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు. విద్యావంతులు, మేధావులు, పేదలు, చదువురాని వారు అనే తేడా లేకుండా పలువురు వారి వలలో చిక్కుకుంటున్నారు. ప్రభుత్వం, పోలీసు శాఖ ఎప్పటికప్పుడు సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ, నేరగాళ్లు మాటలతో నమ్మించి బాధితుల ఖాతాల్లోని నగదును కాజేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, క్రెడిట్ కార్డుల పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
బ్యాంకింగ్ సేవల పేరుతో వల..
బ్యాంకింగ్ సేవల పేరుతో సైబర్ నేరగాళ్లు తొలుత బాధితులకు ఫోన్ చేస్తున్నారు. డెబిట్ కార్డు గడువు ముగియబోతోందని, కొత్త కార్డు ఎంపికైందని, చిరునామా వివరాలు చెప్పాలని ఫోన్ చేస్తూ అయోమయానికి గురిచేస్తున్నారు. బాధితులు స్పందించకపోయినా పదేపదే ఫోన్ చేసి చివరకు వారి నుంచి వ్యక్తిగత వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇలా మోసపోయిన ఘటనలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని ఘటనలు ఫిర్యాదుల వరకు వెళ్లకుండా బయటకు రాకపోవడంతో అసలు బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
తక్కువ ధరకు ఏసీ అంటూ రూ.13 వేలు స్వాహా

ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు ఏసీ విక్రయిస్తున్నారనే ప్రకటనను నమ్మిన ఓ చిరుద్యోగి రూ.13 వేలు పోగొట్టుకున్నాడు. పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆనంద్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఏసీ కొనుగోలు చేయాలని భావించాడు. ఓ స్నేహితుడు తక్కువ ధరకు ఏసీ విక్రయిస్తున్న కంపెనీ ఫోన్ నంబర్‌ను పంపించడంతో దానికి ఫోన్ చేశాడు.
గుంటూరు జిల్లాకు చెందిన కంపెనీ అని, ఏసీని తీసుకుని భవానీపురం వరకు వచ్చి అందజేస్తామని, ముందుగా నగదును ఫోన్‌పే ద్వారా పంపించాలని అవతలి వ్యక్తులు తెలిపారు. దీంతో ఆనంద్ వారి మాటలు నమ్మాడు. కంపెనీ పేరుతో ఓ క్యూ ఆర్ కోడ్‌ను వాట్సాప్‌లో పంపించగా, దాని ద్వారా రూ.13 వేలను ‘వికాస్ చౌదరి ఓఎల్‌ఎక్స్’ పేరుతో ఉన్న ఖాతాకు పంపించాడు.
నగదు పంపిన అనంతరం ఏసీ డెలివరీ కోసం ఎదురుచూశాడు. ఎంతకీ ఏసీ రాకపోవడంతో ఫోన్ చేయగా అవతలి వ్యక్తుల ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఆనంద్ పోలీసులను ఆశ్రయించాడు.
క్రెడిట్ కార్డు పేరుతో రూ.1,07,941 మాయం

సింగ్‌నగర్ నందమూరినగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.1,07,941 నష్టపోయింది. ఈ ఘటనపై అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. చింతాడ శ్రావణి తన భర్తతో కలిసి డ్రైక్లీనింగ్ దుకాణంలో పనిచేస్తోంది. బజాజ్ ఫైనాన్స్ సంస్థ యాప్ ద్వారా క్రెడిట్ కార్డును వినియోగిస్తోంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు గడువు ముగిసిందని, వివరాలను అప్‌డేట్ చేయాలని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.
అనుమానం వచ్చి ఆమె వివరాలు చెప్పేందుకు నిరాకరించింది. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు పదేపదే ఫోన్ చేశారు. చివరకు గూగుల్ ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన కాల్‌లో పుట్టిన తేదీ వివరాలు చెప్పాలని కోరడంతో ఆమె ఆ సమాచారాన్ని వెల్లడించింది. అనంతరం నాలుగు అంకెలతో కూడిన ఓ కోడ్ ఆమె ఫోన్‌కు సందేశంగా వచ్చింది.
ఆ తర్వాత కొద్దికొద్దిగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి మొత్తం రూ.1,07,941 నగదు డెబిట్ అయింది. విషయం గుర్తించిన బాధితురాలు సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులను ఆశ్రయించింది.
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తోనూ మోసాలు

తెలియని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌తో పాటు కంపెనీల పేరుతో వచ్చే ఐవీఆర్‌ఎస్ కాల్స్‌ను నమ్మి మోసపోతున్నామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన సందర్భాలు, రుణాల కోసం ఇంటి పత్రాలను బ్యాంకుల్లో పెట్టిన వారి వివరాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా నగదు బ్యాంకు ఖాతాల్లో జమ అయిన విషయాన్ని గమనించి కొందరిని లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇంటి పత్రాలు బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకున్నవారి వివరాలను కూడా సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని పలువురు చెబుతున్నారు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్ కొనుగోలు సంబంధిత కాల్స్‌ను నమ్మవద్దని, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
