పేదరిక నిర్మూలనకు మెరకనపల్లి స్ఫూర్తి: సాయిబాబు

మోపిదేవి, ఆంధ్రప్రభ: పేదరిక నిర్మూలన ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ–4 కార్యక్రమానికి మెరకనపల్లి గ్రామం స్ఫూర్తిగా నిలుస్తోందని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు అన్నారు.

మంగళవారం మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామంలోని పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద పీ–4 సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచానికే పరిమితమైన అనారోగ్య బాధితులు, వితంతువులు, వృద్ధులు ఉన్న తొమ్మిది కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, దుప్పట్లు, కూరగాయలను అందజేశారు.

పీఏసీఎస్‌ చైర్మన్‌ యర్రంశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో దాతలు గుత్తికొండ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గుత్తికొండ కళ్యాణ్‌, విజయవాడ కేబీఎన్‌ కళాశాల ఏవో డాక్టర్‌ వంగల నారాయణరావు, మాజీ సర్పంచ్‌ అంబటి శ్రీనివాసరావు, కొలుసు ఫణి ఆర్థిక సహకారంతో ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన పెనుమూడి సాయిబాబు పేద కుటుంబాలకు సహాయ సామగ్రిని అందజేశారు. అనంతరం పీ–4 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్మించిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

డాక్టర్‌ వంగల నారాయణరావు, ట్రాన్స్‌ మీడియా సంస్థ ఆర్థిక సహకారంతో నిర్మించిన హిందూ స్మశాన వాటికను, మాజీ ఉప సర్పంచ్‌ కోనేరు సుందర్‌సింగ్‌ ఆర్థిక సహాయంతో కొనుగోలు చేసిన క్రైస్తవ స్మశాన వాటిక స్థలాన్ని సందర్శించారు. అలాగే జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ మంజూరు చేసిన రూ.16 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న పీఏసీఎస్‌ చైర్మన్‌ యర్రంశెట్టి సుబ్బారావును అభినందించారు. పీ–4 కార్యక్రమం ద్వారా గ్రామంలో స్మశాన వాటికల ఏర్పాటు, అభివృద్ధితో పాటు ఎమ్మెల్యే కృషి, జిల్లా కలెక్టర్‌ సహకారంతో సీసీ రోడ్డు సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పీ–4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు సాకారం కావడం ఆదర్శనీయమని తెలిపారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ యర్రంశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ప్రోత్సాహం, స్ఫూర్తితో గ్రామ అభివృద్ధికి, పేదలను ఆదుకునేందుకు దాతల సహకారంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ అంబటి శ్రీనివాసరావు, సొసైటీ పర్సన్‌ కర్రా వెంకటేశ్వరరావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మెరకనపల్లి సుబ్బారావు, పంచాయతీ ఈఓ కే. రామకోటేశ్వరరావు, వీఆర్వో మోపిదేవి వెంకటేశ్వరరావు, సొసైటీ సీఈఓ తలుపుల రంగా, నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ ఉద్యోగులు పావని, స్వాతి, రాజ్యలక్ష్మి, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.