ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు..

పటమట, ఆంధ్రప్రభ : భారతీయ చేనేత సంప్రదాయాల సాంస్కృతిక ప్రాధాన్యాన్ని చాటుతూ విజయవాడ మారిస్‌ స్టెల్లా కళాశాలలో మంగళవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల చరిత్ర, పర్యాటక–ప్రయాణ నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిస్టర్‌ ఇన్న్యాసమ్మ గాడే స్వాగత ప్రసంగం చేశారు. విభాగాధిపతి డాక్టర్‌ జి. బ్యూలా పెర్ల్‌ సునంద చేనేత దినోత్సవం నిర్వహణ ఉద్దేశం, ప్రాధాన్యాన్ని వివరించారు. తరతరాలుగా చేనేత కార్మికులు, నేత కళాకారులు కొనసాగిస్తున్న భారతీయ చేనేత సంప్రదాయం దేశ సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని పేర్కొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి రంజనా సురెడ్డి హాజరై ప్రసంగించారు. సంప్రదాయ హస్తకళలు, స్వదేశీ వస్త్ర విధానాల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం కళాశాల ప్రతినిధులు ఆమెను సత్కరించారు. గతంలో నిర్వహించిన వక్తృత్వ, పోస్టర్‌ రూపకల్పన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వహించిన చేనేత వస్త్రధారణ పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు వివిధ రకాల చేనేత వస్త్రాలను ధరించి వాటి ప్రత్యేకతను ప్రదర్శించారు. పలు దశల్లో సాగిన పోటీలో విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.