నాగర్‌కర్నూల్ జిల్లాలో తగ్గిన 1.13 లక్షల ఓటర్లు

15.45 శాతం ఓట్లు నమోదు కాలేదు.. 84.55 శాతం నమోదు

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఆగస్టు 10తో ఓటర్ల నమోదు ప్రక్రియ గడువు ముగియగా.. జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 7,31,632 మంది ఓటర్లు ఉండగా, 6,18,592 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. దీంతో 1,13,040 ఓట్లు తగ్గాయి.

జిల్లాలో మొత్తం ఓటర్లలో 84.55 శాతం మంది నమోదు కాగా, 15.45 శాతం మంది నమోదు కాలేదు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా మృతిచెందిన వారు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారు, అందుబాటులో లేని వారు, ఇతర కారణాలతో నమోదుకాని ఓట్ల వివరాలను అధికారులు గుర్తించారు.

నియోజకవర్గాల వారీగా తగ్గిన ఓట్లు

నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 2,40,571 మంది ఓటర్లు ఉండగా 38,166 ఓట్లు తగ్గాయి. అచ్చంపేట నియోజకవర్గంలో 2,48,362 మంది ఓటర్లు ఉండగా 39,773 ఓట్లు తగ్గాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో 2,42,699 మంది ఓటర్లు ఉండగా 35,101 ఓట్లు తగ్గాయి. మూడు నియోజకవర్గాల్లో కలిపి 1,13,040 ఓట్లు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.

జిల్లావ్యాప్తంగా 22,669 మంది మృతి చెందినట్లు గుర్తించి వారి ఓట్లను తొలగించారు. 18,260 మంది అందుబాటులో లేని వారిగా నమోదయ్యారు. 51,447 మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు గుర్తించారు. 268 ఓట్లు ఇతరుల పేర్లతో ఉన్నట్లు గుర్తించారు.

ఇంటింటా అవగాహనతో నమోదు

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం, రాజకీయ పార్టీలు విస్తృతంగా కృషి చేశాయి. జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగం, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు కలిసి ఇంటింటికీ వెళ్లడంతో పాటు గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు.

రాజకీయ పార్టీల భాగస్వామ్యం

ఓటర్ల నమోదు ప్రక్రియలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ తదితర రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఓటర్ల నమోదుకు సహకరించారు.

నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా పార్టీలు బీఎల్‌ఏలను నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. బూత్‌ స్థాయి ఏజెంట్లు తమ పరిధిలోని ఇళ్లను సందర్శించి అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు కృషి చేశారు. అయినప్పటికీ జిల్లాలో 15.45 శాతం ఓట్లు నమోదు కాలేదు.

ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న పలువురు తమ స్వగ్రామాల్లో ఓటు నమోదు చేసుకోవడంతో పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య కొంత తగ్గినట్లు తెలుస్తోంది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్యపై స్పష్టత వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.