విశేష అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

మైలవరం, ఆంధ్రప్రభ: ద్వారకాతిరుమల దేవస్థాన దత్తత దేవాలయమైన మైలవరం శివాలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని భ్రమరాంబ అమ్మవారికి మంగళవారం శాకాంబరి అలంకరణను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు.

శాకాంబరి అలంకరణలో కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు మైలవరం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని, పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆషాఢమాసంలో శాకాంబరి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం విశేష పుణ్యప్రదమని భక్తులు విశ్వసించారు. అమ్మవారి ప్రత్యేక అలంకరణతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.