మత్తుపదార్థాల నిర్మూలనకు విస్తృత తనిఖీలు

నార్కోటిక్స్‌ స్నైపర్‌ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు

ఊట్కూర్, ఆంధ్రప్రభ: మత్తుపదార్థాల నిర్మూలనకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని ఊట్కూర్‌ ఎస్సై రమేష్‌ తెలిపారు. నారాయణపేట ఎస్పీ ఆదేశాల మేరకు మత్తుపదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా మంగళవారం ఊట్కూర్‌ మండల కేంద్రంలో ఈగల్‌ ఫోర్స్‌ బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.

ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్స్‌ స్నైపర్‌ పోలీసు జాగిలం విక్కీతో బస్‌స్టాండ్‌, పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు, కొరియర్‌ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మత్తుపదార్థాల రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్సై తెలిపారు.

ప్రజలు ఎవరైనా గంజాయి, మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నా, రవాణా చేస్తున్నా లేదా సరఫరా చేస్తున్నా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌ 1908 లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఈ తనిఖీల్లో ఏఎస్సై తిమ్మారెడ్డి, నార్కోటిక్స్‌ స్నైపర్‌ జాగిలం విక్కీ, డాగ్‌ హ్యాండ్లర్‌ పీసీ రవి తదితరులు పాల్గొన్నారు.