పెద్దజట్రంలో తాగునీటి సమస్య నివారణకు ప్రత్యేక కృషి
నీటి ఎద్దడి నివారణకు పైపులైన్ పనులు ప్రారంభం
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు గ్రామ సర్పంచ్ వాకిటి వెంకటేష్ తెలిపారు. మంగళవారం గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు చేపట్టనున్న పైపులైన్ పనులను ప్రారంభించారు. గ్రామస్థులతో కలిసి పనులను పరిశీలించి, నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వానాకాలంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, గ్రామంలోని వీధులు, కాలనీల్లో పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. నీటి వనరులను పరిరక్షించడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గ్రామంలోని ప్రతి కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
ఎంపీ డీకే అరుణ సహకారంతో గ్రామంలో ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, భవిష్యత్తులోనూ గ్రామాభివృద్ధికి అవసరమైన మరిన్ని పనులు చేపడతామని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి, వార్డు సభ్యులు ఎల్లమ్మ, గౌరమ్మ, వెంకటమ్మ, సోమేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ కిరణ్‌కుమార్, గ్రామస్తులు కొంకల శ్రీను, మాల తిమ్మప్ప, ఎల్లప్ప, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.
