వరుస చోరీలతో ప్రజలు బెంబేలు..

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గంలో వరుస దొంగతనాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ కేసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నప్పటికీ, దుండగులు మాత్రం కొత్త పద్ధతులను అనుసరిస్తూ పోలీసులకు సవాల్‌గా మారుతున్నారు.

తాజాగా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో ముసుగులు ధరించిన దొంగలు రెండు ఇళ్లతో పాటు ఓ ఆలయంలోనూ చోరీకి పాల్పడ్డారు. నియోజకవర్గవ్యాప్తంగా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. కెమెరాలకు చిక్కకుండా దొంగలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

వరుస ఘటనలతో కలవరం

విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో ఇటీవల 130 గ్రాముల బంగారం అపహరణకు గురైంది. ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో బెజవాడ బాలకృష్ణ ఇంట్లో పట్టపగలే తాళాలు పగులగొట్టి బీరువాలోని రూ.లక్ష నగదు చోరీ చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల క్రితం మాధవరం గ్రామంలోనూ ఇదే తరహాలో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు.

తిరువూరు పట్టణంలోనూ ఇటీవల పలు ద్విచక్ర వాహనాలు అపహరణకు గురైనట్లు బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

పోలీసులకు సవాల్‌గా దుండగులు

నేరాలకు పాల్పడిన వారు తప్పించుకోలేరని పోలీసులు చెబుతున్నప్పటికీ వరుస చోరీలు జరగడం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. గతంలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహించి అనుమానితులను పోలీసులు క్షుణ్ణంగా విచారించారు. అయితే ఇటీవలి కాలంలో దొంగతనాల నియంత్రణపై మరింత ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు దృష్టి సారించిన నేపథ్యంలో దొంగతనాల నివారణకు కూడా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

చీమలపాడు ఘటనపై దర్యాప్తు

చీమలపాడులో బెజవాడ బాలకృష్ణ ఇంట్లో జరిగిన చోరీని డీసీపీ లక్ష్మీనారాయణ, మైలవరం ఏసీపీ పి. రామచంద్రరావు, తిరువూరు సీఐ గిరిబాబు, ఎ.కొండూరు పోలీసులు పరిశీలించారు. ఇంట్లో చోరీ జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. విజయవాడ నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలను పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.