ఆర్టీజీఎస్ పనితీరుపై జీఎస్టీ కౌన్సిల్ అధికారుల ప్రశంసలు
- డేటా ఆధారిత పాలన, ఏఐ వినియోగంపై అధ్యయనం..
- ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని అభిప్రాయం
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ కౌన్సిల్ ఉన్నతాధికారులు సందర్శించారు. జీఎస్టీ కౌన్సిల్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డి.పి. మిశ్రా ఆర్టీజీఎస్ కార్యకలాపాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్టీజీఎస్‌లో అమలవుతున్న డేటా ఆధారిత పాలన విధానం, డేటా లేక్ వ్యవస్థ, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, అవేర్ తదితర విభాగాల పనితీరును అధికారులు తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవల పర్యవేక్షణ, నిర్ణయాల రూపకల్పనలో సాంకేతికత వినియోగంపై ఆర్టీజీఎస్ బృందం వారికి వివరించింది.
ఆర్టీజీఎస్ పనితీరును పరిశీలించిన జీఎస్టీ కౌన్సిల్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజా సేవలను మెరుగుపరచడంలో ఆర్టీజీఎస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు ఏ.తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
