102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు మరింత బలోపేతం..
కర్నూలు, ఆంధ్రప్రభ : గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్య సేవలు అందించేందుకు 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి. భరత్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 500 నూతన వాహనాలను అందుబాటులోకి తీసుకురాగా, కర్నూలు జిల్లాకు 27 వాహనాలు కేటాయించినట్లు చెప్పారు.
మంగళవారం కర్నూలు నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, అధికారులతో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
అత్యవసర సమయాల్లో కీలక సేవలు

ఈ సందర్భంగా మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ గర్భిణులను అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో ఆసుపత్రులకు తరలించడం, ప్రసవానంతరం తల్లి, బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో 102 సేవలు కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. నూతన వాహనాల్లో ఏసీ సదుపాయంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఆధునిక సాంకేతిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తల్లి, బిడ్డల సురక్షిత ప్రయాణంలో వాహనాల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను మంత్రి అభినందించారు. కర్నూలు జిల్లాకు కేటాయించిన 27 వాహనాలను అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచి మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు సకాలంలో రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల మెరుగుదల
ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తూ నిధులు, వనరులను సమకూరుస్తున్నామని మంత్రి చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక వసతులు, వైద్య పరికరాలు, భవనాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైన చోట సీఎస్‌ఆర్ నిధుల సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
పాత భవనాల బలోపేతం, వాటర్‌ప్రూఫ్ స్లాబ్‌ల ఏర్పాటు వంటి పనులకు ప్రాధాన్యం ఇచ్చామని, ఇప్పటివరకు సుమారు 21 భవనాలకు సంబంధించిన అభివృద్ధి, బలోపేత పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఆసుపత్రిలో వెంటిలేటర్లు, ఇతర అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కర్నూలు పాత నగరంలోని గడియారం ఆసుపత్రిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. గతంలో మహిళలకు ప్రసవ సేవలు అందించిన ఈ ఆసుపత్రిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన వైద్యశాల జిల్లాకు అత్యంత కీలకమైన వైద్య సంస్థలని పేర్కొన్న మంత్రి.. క్లిష్టమైన కేసులకు కూడా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఈ సంస్థలను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
హైరిస్క్ గర్భిణులకు మరింత ప్రయోజనం
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మరింత బలోపేతం చేయడం ద్వారా హైరిస్క్ గర్భిణులు, ప్రసవానంతర తల్లులు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
కర్నూలు జిల్లాకు ఇప్పటికే 27 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, మరో 17 వాహనాలు త్వరలో జిల్లాకు రానున్నాయని వెల్లడించారు. రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలతో హైరిస్క్‌లో ఉన్న గర్భిణులకు పికప్, డ్రాప్ సౌకర్యాలతో పాటు ప్రసవానంతర రవాణా సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువు, వారి సహాయకులు సురక్షితంగా ప్రయాణించేలా వాహనాలను ప్రత్యేకంగా రూపొందించారని తెలిపారు. ఏసీ సౌకర్యంతో పాటు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునే ఎమర్జెన్సీ బటన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ సేవలను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా మాతృ, శిశు మరణాలను మరింత తగ్గించే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణులు, ప్రసవానంతర మహిళలు ఈ సదుపాయాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని, వైద్య సిబ్బంది కూడా అర్హులకు సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు.
తల్లి, బిడ్డల సురక్షిత ప్రయాణానికి సేవలు
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 2017లో ప్రారంభమైన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 500 నూతన వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
హైరిస్క్ గర్భిణులను ఆసుపత్రులకు తరలించడంతో పాటు ప్రసవానంతరం తల్లి, బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని చెప్పారు. నూతన వాహనాల్లో మెరుగైన భద్రతా సౌకర్యాలతో పాటు ఏసీ వసతి కల్పించారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కామేశ్వర ప్రసాద్, జిల్లా జనసేన అధ్యక్షుడు సురేష్, జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
