చిన్న జాగ్రత్త.. ప్రాణాలకు రక్షణ
రాజమండ్రి, ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచే చర్యల్లో భాగంగా తిలక్ రోడ్డులోని ఆయన కార్యాలయం వద్ద ‘ఉబర్’ సౌజన్యంతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మనం పాటించే చిన్నపాటి జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలు మన ప్రాణాలను కాపాడటమే కాకుండా.. మన కోసం ఇంట్లో ఎదురుచూసే మన కుటుంబానికి శ్రీరామరక్ష అని తెలియజేశారు. అలాగే, వాహనదారులు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రహదారి నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.
