ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలి

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, రక్త పరీక్షలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

పెద్దమందడి, ఆంధ్రప్రభ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు, సిబ్బంది అందుబాటులో ఉన్నందున పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌ అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా గర్భిణులకు సంబంధించిన వివిధ రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్‌.. ప్రతి గర్భిణికి తప్పనిసరిగా రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. రక్తంలో హీమోగ్లోబిన్‌ స్థాయిలు తక్కువగా ఉన్న గర్భిణులకు అవసరమైన మందులు, పోషకాహారంపై సూచనలు అందించి వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం ప్రసవ గదిని పరిశీలించిన కలెక్టర్‌ అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ప్రసవాల కోసం వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులను సిద్ధంగా ఉంచాలని, పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో ఆసుపత్రికి వచ్చే రోగులకు తప్పనిసరిగా రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సాయినాథ్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారి పరిమళ, వైద్యాధికారి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.