158 ఆవాసాలకు తొలిసారి రహదారి సౌకర్యం

  • రూ.422.10 కోట్లతో 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం
  • అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని మారుమూల పల్లెలు, కుగ్రామాలు, ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రంలోని 158 ఆవాసాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించేందుకు పరిపాలన అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద ఈ రహదారి పనులకు రూ.422.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

రాష్ట్ర చిట్టచివరి గ్రామానికి సైతం అభివృద్ధి ఫలాలు అందించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పానికి అనుగుణంగా ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతున్నాయి. మొత్తం 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నారు. ఈ రహదారుల నిర్వహణ కోసం ఐదేళ్ల కాలానికి అదనంగా రూ.24.47 కోట్లు విడుదల చేశారు.

15 జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు అనుసంధానం..

రహదారి సౌకర్యం పూర్తిస్థాయిలో లేని ఆవాసాలను గుర్తించి ఆ ప్రాంతాలకు రహదారుల నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఈ పనులు చేపట్టనున్నారు.

ఇప్పటికే “అడవితల్లి బాట” పేరుతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు గిరిశిఖర గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా మైదాన ప్రాంతాల్లోని మారుమూల ఆవాసాలకు సైతం రహదారులను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.

నాణ్యతపై ప్రత్యేక దృష్టి..

రహదారుల నిర్మాణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా రోడ్ల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో 158 ఆవాసాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

రహదారులు, వంతెనల నిర్మాణంతో మారుమూల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో అనుసంధానం మరింత మెరుగుపడుతుందని ఆయన అన్నారు. దీంతో గ్రామీణ ప్రజలకు విద్య, వైద్యం, మార్కెటింగ్, రవాణా వంటి సదుపాయాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ రహదారి పనులను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం చేపట్టనుంది. మారుమూల ప్రాంతాల్లో నిర్మించే ప్రతి రహదారి నాణ్యత, మన్నిక విషయంలో రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులు దిశానిర్దేశం చేశారు.