విజయవాడలో ఉన్నత విద్యకు ‘ఎన్టీఆర్’ బాట
విద్యార్థుల భవిష్యత్తుకు నైపుణ్య విద్యతో కొత్త అవకాశాలు
ఎన్టీఆర్ పీజీ సెంటర్లో పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు
ఆగస్టు 24 నుంచి డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రారంభం
(విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయవాడ–అమరావతి ప్రాంత విద్యార్థులకు స్థానికంగానే ఉన్నత విద్య, ఉపాధి ఆధారిత నైపుణ్యాలను అందించేందుకు కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా. ఎన్టీఆర్ పీజీ సెంటర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వచ్చింది. నేటి ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా సంప్రదాయ విద్యతో పాటు ఆధునిక సాంకేతిక, వృత్తి నైపుణ్యాలను అందించేలా కేంద్రంలో వివిధ కోర్సులను అందుబాటులో ఉంచారు.
విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లా, అమరావతి ప్రాంత విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కూన రామ్‌జీ తెలిపారు. ఉన్నత విద్య కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమన్నారు. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, లాజిస్టిక్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కోర్సులను రూపొందించినట్లు తెలిపారు.
పీజీ నుంచి నైపుణ్య కోర్సుల వరకు..
2026–27 విద్యా సంవత్సరానికి ఎం.ఎస్సీ మైక్రోబయాలజీ, ఎం.ఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎం.ఏ. హ్యుమానిటీస్ అండ్ కమ్యూనికేటివ్ స్టడీస్ వంటి పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా కోర్సుల్లో అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్, ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ టెక్నాలజీ, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఆరు నెలల వ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ఏఐ అండ్ రోబోటిక్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ క్రైమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ మేనేజ్మెంట్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్‌తో పాటు జర్మన్, ఫ్రెంచ్, సంస్కృతం, యోగా, కూచిపూడి, కలంకారి తదితర కోర్సులను కూడా అందుబాటులో ఉంచారు.
24 నుంచి హాస్పిటల్ మేనేజ్మెంట్..
ఆరోగ్యరంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సును ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్నట్లు వీసీ ప్రొఫెసర్ కూన రామ్‌జీ తెలిపారు. కేంద్రం ప్రిన్సిపాల్ ఆచార్య ఈ. దిలీప్ మాట్లాడుతూ… విద్యార్థులు, తల్లిదండ్రులు కేంద్రంలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.డిగ్రీతో పాటు అదనపు నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని వీసీ పేర్కొన్నారు. విజయవాడ–అమరావతి ప్రాంత విద్యార్థులకు స్థానికంగానే ఉన్నత విద్య, నైపుణ్య విద్యను అందించే కేంద్రంగా డా. ఎన్టీఆర్ పీజీ సెంటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కోర్సుల వివరాలకు: 94947 47401, 98853 90222. నెంబర్లను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.
