వృద్ధుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి

సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

సిబ్బంది సమయపాలన పాటించి బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉంటున్న చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత, అవసరమైన సంరక్షణ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం సుల్తానాబాద్‌ మండలంలోని క్యాడర్‌ దివ్యాంగుల పాఠశాల, వృద్ధాశ్రమం, బాల సదనం పాఠశాల, మండల విద్యా వనరుల కేంద్రంతో పాటు పెద్దపల్లిలోని రంగంపల్లి బాల రక్షక భవన్‌ను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి సౌకర్యాలు, సిబ్బంది విధుల నిర్వహణ, వంటశాలలు, డార్మిటరీలను పరిశీలించారు.

వంటశాలల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యత, సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ ఆరా తీశారు. ప్రతి ఉద్యోగి నిర్ణీత సమయానికి విధులకు హాజరై, తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని సూచించారు. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యం, భద్రత, ఆహారం, వసతి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. బాల రక్షక భవన్‌లో చిన్నారుల సంరక్షణ, రక్షణకు సంబంధించిన అంశాలను సమీక్షించిన ఆయన.. పోక్సో కేసుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలలపై లైంగిక వేధింపులు, హింస ఘటనలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో రక్షణ, సహాయం, కౌన్సెలింగ్‌ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా శాఖల మధ్య సమన్వయం పెంచాలని, భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అవసరమైన సేవలు అందేలా చూడాలని ఆదేశించారు.