పశువైద్య సేవలు మెరుగుపరచాలి
సకాలంలో వైద్యం అందేలా చర్యలు..
తిమ్మాజీపేట వెటర్నరీ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: పశుసంపద పరిరక్షణతో పాటు పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిమ్మాజీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మరికల్ గ్రామంలో రైతులను కలిసి పశుపోషణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, పశువులకు నిర్వహిస్తున్న చికిత్సలు, అందుబాటులో ఉన్న మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులు పశువులకు వైద్యం కోసం వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే సేవలు అందించాలని సూచించారు. తిమ్మాజీపేట మండలంలో ఉన్న పశువుల సంఖ్య, వాటి ఆరోగ్య పరిస్థితి, పశువుల యజమానుల వివరాల నమోదు ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. పశువులు, రైతుల ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో తప్పులు లేకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేందుకు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పశువులకు టీకాలు, వైద్య పరీక్షలు, చికిత్సలు సకాలంలో అందుతున్నాయా అనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో పాండు, తిమ్మాజీపేట సర్పంచ్ కవిత, మండల అధికారులు, పశువైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
