దేవాదుల నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి

తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు..

గణపురం చెరువులో 25 అడుగుల నీరు ఉండేలా చూడాలి

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణ, నీటి లభ్యత, పంపుహౌస్‌ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను కోరారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హన్మకొండ జిల్లా చింతగట్టులోని చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.

ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. భీమ్‌ఘనపూర్‌ చెరువు నుంచి రామప్ప చెరువుకు, అక్కడి నుంచి వంగపెల్లి వాగు ద్వారా గణపురం చెరువులోకి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గణపురం చెరువులో నీటి నిల్వ పెంచితే భూపాలపల్లి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని చెప్పారు. పరకాల చలివాగులోనూ నీరు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎమ్మెల్యే సూచనలపై స్పందించిన అధికారులు గణపురం చెరువులో 25 అడుగులు, పరకాల చలివాగులో 17 అడుగుల నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు కడియం శ్రీహరి, నాగరాజు, యశస్వినిరెడ్డి, ఇరిగేషన్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.